దోశ పిండి అయిపోతే టిఫిన్ ఏమి చేయాలో తెలియక పోతే వెంటనే అప్పటికప్పుడు త్వరగా తయారు చేసుకోగలిగే టిఫిన్ (break fast) ఐడియా బొంబాయిరవ్వ తో అందరికి తప్పక నచ్చుతుంది. బయట రూమ్స్ లో ఉండే వాళ్లు కూడా చాలా తేలికగా తయారు చేసుకునే బొంబాయిరవ్వ ఊతప్పం మరియు బొంబాయిరవ్వ గుంత పొంగనాలు. 



గుంత పొంగనాలు

కావలసిన పదార్థాలు :

  బొంబాయిరవ్వ ఒక కప్పు 

  పెరుగు  ఒక కప్పు 

  ఉప్పు తగినంత 

  పచ్చిమిర్చి రెండు 

  క్యారెట్ తురుము ½ కప్పు 

  క్యాబేజ్ తురుము ½ కప్పు 

  ఉల్లిపాయ ముక్కలు ¼ కప్పు 

  నూనె   2 చెంచాలు 

  సోడా ఉప్పు ¼ చెంచా 


తయారీ విధానం :


  • బొంబాయి రవ్వ మరియు పెరుగు ని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 

  • 10 నిమిషాలు తర్వాత కలిపి ఉంచుకున్న పెరుగు మరియు బొంబాయిరవ్వ మిశ్రమంలో తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి పిండి మరీ గట్టిగా అనిపిస్తే చాలా కొద్దిగా నీళ్ళు వేసి కలిపి అందులో సోడా ఉప్పు వేసి కలపాలి. 

  • ఇప్పుడు పొయ్యి మీద పొంగనాలు పాత్ర ను ఉంచి అందులో కొంచెం నూనె వేసి నూనె కొద్దిగా వేడి అయున తర్వాత అందులో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని పొంగానాల పాత్రలో కొంచెం కొంచెం గా వేసి మూత పెట్టి 10నిమిషాలు ఉడికించుకొని తరువాత రెండో వైపుకు తిప్పు కోవాలి. 

రెండు పక్కలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. 


ఏ చట్నీ, కారం పొడి లేదా నిల్వ పచ్చడితో అయినా చాలా రుచిగా ఉంటాయి. 


రవ్వ ఊతప్పం

కావలసిన పదార్థాలు :

బొంబాయిరవ్వ రెండ కప్పులు 

పెరుగు ఒకటిన్నర కప్పు 

ఉల్లిపాయ రెండు 

పచ్చిమిర్చి నాలుగు 

క్యారెట్ తురుము ఒక కప్పు 

ఉప్పు తగినంత 

జీలకర్ర ఒక చెంచా 

గోధుమపిండి 2 చెంచాలు 

నీళ్లు అర గ్లాసు 

నూనె 4 లేదా5 చెంచాలు 


తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో పెరుగు మరియు బొంబాయిరవ్వ ని వేసి కలిపి మూత పెట్టి 10నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 

  •  10 నిమిషాలు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కలిపి ఉంచుకున్న బొంబాయిరవ్వ మిశ్రమాన్ని వేసి, అందులో తగినంత ఉప్పు, రెండు చెంచాల గోధుమపిండి వేసి ½ గ్లాసు నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 

  • ఈ విధంగా మిక్సీ పట్టుకోన్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. 

  • పొయ్యి మీద దోశ పెనం పెట్టి పెనం వేడి అయిన తర్వాత బొంబాయిరవ్వ మిశ్రమాన్ని దోశ పెనం మీద మందంగా వేసుకొని దాని పైన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు మరియు కొద్దిగా జీలకర్ర వేసి ఊతప్పం చూట్టూ నూనె వేసి బాగా కాల్చుకోవాలి. అదే విధంగా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. 


ఈ  విధంగా కాల్చుకున్న ఊతప్పం కొబ్బరి చట్నీ తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. 



తేలికగా అప్పటికప్పుడు చేసుకోగలిగే స్నాక్స్ లేదా టిఫిన్ ఐటమ్స్ ఊరు వెళ్లి వచ్చిన లేదా ఎక్కడికైనా బయటకి వెళ్లి వచ్చిన త్వరగా నోటికి రుచిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఈ రెండింటి ఒక సారి ప్రయత్నం చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది.